DEVOTIONAL

తిరుమలలో నీటి లభ్యతపై అపోహలు వద్దు

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన టీటీడీ ఈవో శ్యామ‌ల రావు

తిరుమ‌ల – తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు.

తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో మీడియాతో మాట్లాడారు. ఆదివారం (25వ తేదీ ఆగ‌స్టు) నాటికి తిరుమలలో కుమార ధార, పసుపుధార, పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్‌లలో కలిపి 4,592 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉందన్నారు.

⁠తిరుపతి, తిరుమల నీటి అవసరాలకు ఉపయోగ పడే తిరుపతిలోని కల్యాణి డ్యాంలో నేటికి 5,608 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంద‌ని తెలిపారు ఈవో.

⁠తిరుపతి, తిరుమలలో ఉన్న నీటిని క్రమ పద్ధతిలో వినియోగించు కోవడం ద్వారా, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు నీటి అవసరాలతో సహా 130 రోజుల వరకు (అంటే 31-12-2024 వరకు) సరిపోతుందని వెల్ల‌డించారు.

ఆగస్టు 22న తిరుపతి మున్సిపల్ కమీషనర్, సోమశిల ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తో చర్చించడం జ‌రిగింద‌న్నారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ కల్యాణి డ్యామ్ నుండి 5 MLD (11 లక్షల గ్యాలన్లు) నీటిని అదనంగా సరఫరా చేయడానికి అంగీకరించారని తెలిపారు ఈవో. తద్వారా అదనంగా మరో నెల రోజులు తిరుమల నీటి అవసరాలు తీరుతాయ‌ని పేర్కొన్నారు.

⁠కైలాసగిరి రిజర్వాయర్ నుండి మరో 10 MLD నీరు తిరుపతికి సరఫరా కానుంద‌ని, అదేవిధంగా తిరుపతికి నీటి సరఫరాను పెంచడానికి అదనపు పైప్‌లైన్ వేయడానికి టిటిడి రూ.40 కోట్లు మంజూరు చేసింద‌న్నారు.

⁠టిటిడి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటి విడతగా రూ. 5.62 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. అదనపు పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కోరడం జ‌రిగింద‌న్నారు. తద్వారా తిరుపతి నుండి తెలుగు గంగ నీరు తిరుమలకు సరఫరా చేయడానికి వీలవుతుందన్నారు.

అంతకు ముందు ఈవో టీటీడీ ఇంజనీరింగ్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు.