వాల్మీకి స్కామ్ లింకులపై విచారణ చేపట్టాలి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కర్ణాటకలో చోటు చేసుకున్న వాల్మీకి స్కామ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ స్కామ్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలు, వ్యాపార వేత్తలకు లింకులు ఉన్నాయని ఆరోపించారు.
ఇందుకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులు ఎవరికి రూ. 45 కోట్లు జమ చేశారంటూ ప్రశ్నించారు కేటీఆర్. మరో రూ. 4.5 కోట్లు బదిలీ చేయడం వెనుక ఉన్నది ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
SIT, CID , ED దాడులు నిర్వహించిన తర్వాత కూడా తెలంగాణలోని మీడియా సర్కిల్లలో వార్తలు ఎందుకు రాకుండా చేశారంటూ నిలదీశారు కేటీఆర్.
లోక్సభ ఎన్నికల సమయంలో నగదు విత్డ్రా చేసిన బార్ లు, వాటి యజమానులు, బంగారు దుకాణాలు ఎవరివి..వాటిని ఎవరు నడుపుతున్నారు..ఎవరికి ఎంతెంత జమ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య తో పాటు ఆయన కుటుంబం రూ. 90 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయని, వీటిపై గవర్నర్ విచారణకు ఆదేశించారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చాలని అన్నారు కేటీఆర్.