ఎనిమిది నెలల్లో రూ. 65 వేల కోట్ల అప్పు
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్ – అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఎంత సేపు గత ప్రభుత్వాన్ని తిట్టి పోయడం తప్పా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు.
ఆదివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రతి నెలకు రూ. 8125 కోట్ల చొప్పున అప్పులు చేసిందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రూ. 65 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని ధ్వజమెత్తారు తన్నీరు హరీశ్ రావు.
నెల చొప్పున లెక్కిస్తే రాబోయే ఐదేళ్ల కాలంలో అంటే 60 నెలలకు దాదాపు రూ. 4 లక్షల 87 వేల 500 కోట్లు అప్పు చేయబోతోందని ఇదంతా నాలుగున్నర కోట్ల ప్రజలపై అప్పు భారం పడక తప్పదని హెచ్చరించారు.
రైతులకు సంబంధించి రుణాలను మాఫీ చేయడంలో ఘోరంగా విఫలం అయ్యారంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు మాజీ మంత్రి.