కూల్చివేతలపై ఓవైసీ కన్నెర్ర
ఏ ప్రాతిపదికన చేస్తున్నారంటూ ప్రశ్న
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఆక్రమణల కూల్చవేతలపై స్పందించారు. ఆదివారం ఓవైసీ మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాతిపదికన కూల్చి వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు ఓవైసీ.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ప్రస్తుతం హైదరాబాద్ లో పలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చి వేస్తుందా..అంత దమ్ముందా అని ప్రశ్నించారు ఎంపీ. భవనాలే కాకుండా కార్యాలయాలు కూడా ఉన్నాయని, తన వద్ద పూర్తి లిస్టు ఉందని, వస్తే ఇస్తానని అన్నారు ఓవైసీ.
మరి ప్రభుత్వ భవనాలు, ఆఫీసులను హైడ్రా కూల్చి వేస్తుందా అని నిలదీశారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, మరి దానిని కూల్చేసే దమ్ము రంగనాథ్ కు, సీఎంకు ఉందా అని పేర్కొన్నారు ఎంపీ. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీసీఎంబీ ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉందని, ఆ విషయం సీఎంకు తెలుసా అని అన్నారు. అది కూడా కూల్చి వేస్తారా..అని ఆసక్తికరంగా ప్రశ్నించారు ఓవైసీ.