యువత కోసం ఈడీపీ కార్యక్రమం
స్పష్టం చేసిన నారా లోకేష్
అమరావతి – ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే యువత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) ఈడీపీ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ (ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది.
అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయాశాఖల అధికారులు చర్చలు ప్రారంభించారు. అక్కడ నేర్పే పరిశ్రమల సిలబస్‌కు అనుగుణంగా 4 లేదా 6 వారాలు శిక్షణ అందించనున్నారు. ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనున్నారు.
ఈ విషయాన్ని ఏపీ ఐటీ, విద్యా, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి చెందిన యువతీ యువకులు ప్రభుత్వం అందించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.