రైతులకు శాపం కాంగ్రెస్ మోసం
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ పార్టీ
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పడంలో టాప్ లో కొనసాగుతోందని ఎద్దేవా చేసింది బీఆర్ఎస్ పార్టీ. సోమవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. రైతు బంధుకు దిక్కు లేదని, రైతు భరోసా జాడే కనిపించడం లేదని వాపోయింది.
వేలాది మంది రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, మరికొందరు రోడ్లపైకి వచ్చారని పేర్కొంది. పంటల సాగు సమయంలో కావాల్సిన సాయం అందక పోవడంతో నానా తంటాలు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బీఆర్ఎస్.
పంటలు చేతికొచ్చిన సమయంలో సైతం ఆర్థిక సాయం అందించక పోవడం దారుణమని పేర్కొంది. ఇది మంచి పద్దతి కాదని సూచించింది. ప్రత్యేకించి రైతులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది.
కాంగ్రెస్ సర్కార్ కావాలని కాలయాపన చేస్తోందని, రైతులను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది బీఆర్ఎస్. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు, రైతు భరోసా కింద రావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేయాలని కోరింది.