సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీ రామారావు
హైదరాబాద్ : అధికారం ఉంది కదా అని విర్రవీగి , నరహంతకుడిగా పేరు పొందిన హిట్లర్ సైతం నామ రూపాలు లేకుండా పోయాడని ఇక ఇదే పవర్ ను చూసుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నువ్వెంత అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఎర్రగడ్డలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎంపై. బీఆర్ఎస్ లీడర్ షరీఫ్‌ను బలవంతంగా తీసుకెళ్లి కండువా కప్పారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి చేయడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని అన్నారు కేటీఆర్. దమ్ముంటే ఎన్నికల్లో పోరాడాలని సవాల్ విసిరారు. పదేళ్లలో కేసీఆర్ ప్రజలను ఎలా చూసుకున్నారో అందరికీ తెలుసు అన్నారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మితో రూ. లక్ష ఇచ్చారని, మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేలు అందించామని అన్నారు. లక్షా 50 వేలా పట్టాలు అందించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు కేటీఆర్. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించిన ఘనత కూడా తమదేనని అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు అందరినీ బాగా చూసుకున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఐటీ సెక్టార్ లో 3 లక్షల మంది పని చేస్తుంటే తాము వచ్చాక ఆ సంఖ్యను 13 లక్షలకు పెంచామని అన్నారు కేటీఆర్. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. 420 అబద్దాలు చెప్పారు, ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారని ఆరోపించారు. ఇకనైనా ప్రజలు గమనించి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని, కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలన్నారు.






