ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం
నిప్పులు చెరిగిన భారత రాష్ట్ర సమితి
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. రైతు భరోసా , రైతు బంధు ద్వారా ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందలేదని వాపోయింది.
ప్రధానంగా రైతు భరోసా ఆలస్యం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు లబోదిబోమంటున్నారని పేర్కొంది. రైతుల కష్టాలను మరింత పెంచేలా చేసిందని తెలిపింది. వానా కాలం పంట ముగుస్తోందని ఈ తరుణంలో ఇంకా సాయం అందజేయడంలో మీన మేషాలు వేస్తోందని మండిపడింది బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ పై.
ఇక రైతు భరోసా పథకం కింద ఎంతో మంది ఎదురు చూసిన ఆర్థిక సహాయం అస్పష్టంగానే ఉండడంతో తెలంగాణలోని రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు గుప్పించినా రైతులకు ఇంకా ఎలాంటి ఆదరణ లభించక పోవడంతో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపింది. రుణమాఫీ ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నందున కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయని ఆరోపించింది.