షాద్ నగర్ కు హైడ్రా కావాలి – ఎమ్మెల్యే
ఎ. రేవంత్ రెడ్డికి వీర్లపల్లి శంకర్ వినతి
హైదరాబాద్ – తెలంగాణలో సీఎం ఎ. రేవంత్ రెడ్డికి భారీ ఎత్తున మద్దతు పెరుగుతోంది. ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా ఝులిపించారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా తాను విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ సారథ్యంలో హైడ్రా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఇది హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను గుర్తించడం, వాటిని కూల్చడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు బడా ప్రముఖులను టార్గెట్ చేసింది. మొత్తం 18 అనధికారంగా ప్రభుత్వ భూములను , చెరువులను ఆక్రమించుకుని నిర్మించిన భవనాలను ఉన్న పళంగా కూల్చి వేసింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి అందజేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, తమకు కూడా హైడ్రా కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి తమ నియోజకవర్గానికి కూడా హైడ్రా కావాలంటూ కోరారు. ప్రస్తుతం ఆయన హాట్ టాపిక్ గా మారారు.