ఓవైసీ..మల్లారెడ్డికి ఒకటే రూల్ – రంగనాథ్
సీరియస్ కామెంట్స్ చేసిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా, ఎంతటి స్థాయిలో ఉన్నా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కమిషనర్.
ఎవరు అక్రమాలకు పాల్పడినా, ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బండ్లగూడలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అక్రమంగా ఫాతిమా కాలేజీని నిర్మించారు. ఇందులో 12 భవనాలు ఉన్నాయి. 40 వేల మంది పేద విద్యార్థులకు ఇందులో ఉచితంగా విద్యను అందజేస్తున్నామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.
తనపై కావాలని అనుకుంటే కాల్పులు జరపాలని, కానీ కాలేజీని కూల్చ వద్దంటూ కోరారు ఎంఐఎం ఎమ్మెల్యే. మరో వైపు పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన కాలేజీలు కూడా అక్రమంగా నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి మల్లా రెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఈ తరుణంలో అక్రమ నిర్మాణాలపై స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అక్బరుద్దీన్ ఓవైసీ అయినా..మల్లా రెడ్డి అయినా ఒకటే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తామని హెచ్చరించారు.