విధుల్లోకి రాకపోతే వేటు తప్పదు – సీఎం
ఉద్యోగులను హెచ్చరించిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ – రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు . కోల్ కతా లోని ఆర్జే కర్ హాస్పిటల్ లో చోటు చేసుకున్న డాక్టర్ రేప్ , మర్డర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది.
మరో వైపు పశ్చిమ బెంగాల్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. యువతీ యువకులు, విద్యార్థులు, అన్ని వర్గాలకు చెందిన వారంతా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని, డాక్టర్ హత్య, అత్యాచారానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. విద్యార్థులపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. మరో వైపు ఉద్యోగులు బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం మమతా బెనర్జీ. ప్రతి ఒక్కరు విధులకు హాజరు కావాలని లేక పోతే ఎవరు రాక పోయినా వారిని జాబ్స్ నుంచి తొలగిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం.