తెలంగాణ బిడ్డను పోరాటం ఆపను
ఇబ్బందులు పెట్టిన వాళ్లను వదలను
హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలులో 165 రోజుల పాటు ఉన్న ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కవిత.
తాను తెలంగాణ బిడ్డనని, పోరాటం తనకు కొత్త కాదన్నారు. గత 18 సంవత్సరాలుగా తాను ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. పోరాటం చేయడం, ఆందోళనలు చేపట్టడం తన జీవిత కాలంలో ఎన్నో చేశానని జైలు జీవితం తనకు కొత్తగా ఏమీ అనిపించ లేదన్నారు కవిత.
కొందరు కావాలని తనను అడ్డం పెట్టుకుని తన తండ్రి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా చివరకు న్యాయమే గెలిచిందని చెప్పారు. తనకు , తన తండ్రి కేసీఆర్ కు, పార్టీకి, కుటుంబానికి ముందు నుంచి వెన్ను దన్నుగా ఉన్న వారికి, మద్దతు తెలియ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు కల్వకుంట్ల కవిత.
తనను అక్రమంగా జైలులో ఉంచారని దేశ వ్యాప్తంగా ప్రజలకు తెలుసన్నారు. ఏది ఏమైనా తిరిగి తాను నిర్దోషిగా నిరూపించుకుంటానని ప్రకటించారు. అంత వరకు ఇలాగే మీ మద్దతు తనకు ఉండాలని కోరారు.