అర్చకులకు సీఎం తీపి కబురు
ధూప దీప నైవేద్యాలకు పెంపు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. దేవాదాయ శాఖపై సమీక్ష చేపట్టిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయా దేవాలయాలలో పని చేస్తున్న అర్చకులు, పూజారులకు గుడ్ న్యూస్ తెలిపారు.
గత ప్రభుత్వం అర్చకులను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం.
ఇందులో భాగంగా నిత్యం భక్తులకు సేవలు అందిస్తున్న అర్చకులకు గతంలో రూ. 10 వేలు మాత్రమే ఇచ్చే వారని కానీ తమ ప్రభుత్వం మానవతా దృక్ఫథంతో ఆలోచించిందని పేర్కొన్నారు. మరో రూ. 5 వేలు పెంచుతూ నెలకు ఇక నుంచి అర్చకులకు రూ. 15 వేల వేతనం అందజేస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
అంతే కాకుండా ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. దీంతో పాటు నిరుద్యోగ వేద విద్యార్ధులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తామని అన్నారు.
మరో వైపు నాయీ బ్రాహ్మణులకు సైతం తీపి కబురు చెప్పారు సీఎం. కనీస వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.