సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన
10 రోజుల పాటు నిర్వహించాలన్న సీఎం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన చేపట్టాలని ఆదేశించారు. మొత్తం 10 రోజుల పాటు నిర్వహించాలని వెల్లడించారు సీఎం.
ప్రజా పాలనలో భాగంగా రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలని సూచించారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని స్పష్టం చేశారు. దీని వల్ల ఎంత మందికి ఎన్ని రోగాలు ఉన్నాయనే దానిపై ప్రభుత్వానికి ఓ అవగాహన వస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు ఉండాలన్నదే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు సీఎం. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు .
హెల్త్ ప్రొఫైల్స్ ను పూర్తి పారదర్శకతతో ఉండేలా చూడాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు సీఎం. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చడం జరుగుతుందన్నారు సీఎం. వైద్య ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరతో పాటు సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.