మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు ఫిర్యాదు
కవితపై ట్రోల్స్ ఆపాలంటూ కార్పొరేటర్స్ లేఖ
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా కార్పొరేటర్లు. సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేస్తూ దూషిస్తున్నారని, కించ పరిచేలా ట్రోల్స్ చేస్తున్నారంటూ వాపోయారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కల్వకుంట్ల కవితపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టాలని కోరుతూ హైదరాబాద్ లోని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా మహిళా కార్పొరేటర్లు వినతిపత్రం సమర్పించారు. మహిళా కమిషన్ తక్షణమే చర్య తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విన్నవించారు.
తనను కలిసిన మహిళా కార్పొరేటర్లకు పూర్తి హామీ ఇచ్చారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.