రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేలా ఉండాలి
తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డ్ పై సీఎం సమీక్ష
హైదరాబాద్ – తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడనున్న ఫ్యూచర్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలన్నారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమన్ గల్ – చేవెళ్ల – శంకర్ పల్లి – సంగారెడ్డి వరకు) కు సంబంధించి అధికారులు అలైన్ మెంట్ రూపొందించారు.
దీనిలో మరికొన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ, భూ సేకరణ చేయాలని ఆదేశించారు. భూములిచ్చే రైతులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు.
మన దగ్గర డ్రైపోర్టును ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ రేవులతో అనుసంధానం చేసే అవకాశాలపై అధ్యయనం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని, ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సీఎం అన్నారు.
ఓఆర్ఆర్ , ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
కాలిఫోర్నియాలో ఆపిల్ పండ్ల తోటలోనే ‘ఆపిల్’ సంస్థ కార్యాలయం, బెంగళూరులో జిందాల్ నేచర్ కేర్ తరహాలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలోనూ పర్యావరణహిత నిర్మాణాలకు అధ్యయనం చేయాలన్నారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన రాచకొండలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.