తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాలి – సీఎం
బాబు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా తెలుగు భాష పరిరక్షణకు సంబంధించి దినోత్సవాన్ని ఆగస్టు 29న నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇదిలా ఉండగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషాభివృద్దికి విశేష కృషి చేసిన మహనీయులను నేడు తలుచు కోవడం ద్వారా అమ్మ భాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదామని పేర్కొన్నారు.
వారి అడుగుజాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్ బాధ్యతను మనం తీసుకుందామని పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్దిలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికీ, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులకు నివాళులు అర్పించారు సీఎం.
తెలుగు భాష జగతికి వెలుగునిచ్చే భాష అని కొనియాడారు. ఇతర భాషలను గౌరవిస్తూనే తెలుగు భాషను పరిక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు.