గిడుగు ప్రయత్నం తెలుగు భాషకు జీవం
నారా లోకేష్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
అమరావతి – ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్. బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలుగు వాడుక భాషలో రచనలు ఉండాలని జీవితాంతం ఉద్యమించిన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి ని స్మరించుకున్నారు.
ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించు కోవడం, ఆ మహనీయుని కృషిని స్మరించుకునే అవకాశం తెలుగు వారిగా మనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు నారా లోకేష్.
అమ్మ జన్మనిస్తే, మాతృ భాష తెలుగు మన జీవితాలకు వెలుగునిస్తోందని అన్నారు. ఇంగ్లీషు మీడియం, విదేశాల్లో చదువు వల్ల తాను మొదట్లో తెలుగులో మాట్లాడేటప్పుడు పదాలు అటు ఇటు అయితే.. ఎంతో బాధ పడేవాడిని పేర్కొన్నారు.
అచ్చమైన తెలుగులో నిత్యం జనంతో మాట్లాడుతూ ఉంటే మాతృభాష మాధుర్యం ఎంత గొప్పదో తెలుస్తోందన్నారు. మా అబ్బాయి దేవాన్ష్‌కి ప్రత్యేకంగా తెలుగు మాట్లాడటమే కాదు.. చదవటం, రాయటం కూడా నేర్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు వారిగా గర్వపడదాం.. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు నారా లోకేష్.