తెలుగు భాషను కాపాడుకుందాం
పిలుపునిచ్చిన నారా భువనేశ్వరి
అమరావతి – ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. తల్లి భాష అనేది పుడుతూనే ప్రతి ఒక్కరికీ దక్కే వారసత్వ సంపద లాంటిదని పేర్కొన్నారు. అలా మనకు దక్కిన తెలుగు భాషను గౌరవిద్దామని, భాష పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు నారా భువనేశ్వరి.
వృత్తి పరంగా ఇతర దేశాలకు వెళ్లినా , గత్యంతరం లేక ఇతర భాషలను నేర్చుకున్నా మన తల్లి లాంటి తెలుగు భాషను మాత్రం మరిచి పోవద్దంటూ సూచించారు. తెలుగు భాష అద్భుతమైన భాష అని, దేశంలోనే అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని పేర్కొన్నారు.
తెలుగు భాష అంతటి తీయనైన భాష ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఆనాడు తెలుగు భాషా పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని గుర్తు చేసుకున్నారు నారా భువనేశ్వరి.
ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషను కూడా గౌరవించాలని, మాతృ భాషలో పట్టు సాధించ గలిగితే ఏ భాష లోనైనా సక్సెస్ అవుతామని ఈ సందర్బంగా పేర్కొన్నారు. తెలుగు వారంతా ఎక్కడున్నా తెలుగు జాతిని, సంస్కృతిని, నాగరికతను, భాషను మరిచి పోవద్దంటూ సూచించారు.