హైడ్రా పేరుతో వసూలు చేస్తే జాగ్రత్త
తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి కొందరు కింది స్థాయి అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడు ఏళ్‌ల కిందట అందిన ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్ ,నీటి పారుదల శాఖ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు సీఎం.
ఏ మాత్రం విచారణలో తేలితే ఊరుకునే ప్రసక్తి లేదని, తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఎవరైనా వసూళ్లకు పాల్పడినా లేదా ఇబ్బందులకు గురి చేసినా లేదా బెదిరించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఏ స్థానంలో ఉన్నా వదిలి పెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు.
కాగా వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా వారి వివరాలు అందజేయాలని పేర్కొన్నారు సీఎం.