అనుమతిచ్చిన అధికారులపై హైడ్రా కొరడా
అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన దూకుడు పెంచారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేస్తూనే మరో వైపు వీటికి అనుమతి ఇచ్చిన వారు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై విచారణ చేపట్టారు.
ఇందులో భాగంగా సంచలన ప్రకటన చేశారు. చెరువు స్థలాలలో భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారుల జాబితా తయారు చేస్తున్నారు. వారిపై ఫోకస్ పెట్టారు ఏవీ రంగనాథ్. ఈ మేరకు నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన సదరు అధికారులపై కొరడా ఝులిపించేందుకు రెడీ అయ్యారు.
ఈమేరకు సదరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ ఏవీ రంగనాథ్. దీంతో ఆయన తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది ఉన్నత స్థాయి అధికారులలో. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నతాధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గండిపేట, మాదాపూర్ పరిసరాల్లో కట్టడాలకు అనుమతించిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఐదుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించడం కలకలం రేపుతోంది.