మహిళా వైద్యులకు భద్రత కల్పించాలి – ఎంపీ
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విజయ సాయి రెడ్డి
అమరావతి – వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్ కతాలోని ఆర్జే కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా మహిళా వైద్యులు, శిక్షణ పొందుతున్న డాక్టర్ల రక్షణ పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గురువారం ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. విచిత్రం ఏమిటంటే మహిళా వైద్యుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందోనన్న విషయం తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చేపట్టిన సర్వేలో వెల్లడైందని తెలిపారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ పోతే చివరకు మహిళా వైద్యులు విధులలోకి రాని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
భారతదేశంలో రాత్రి పూట పనిచేసే వైద్యుల్లో దాదాపు మూడింట ఒకవంతు మంది మహిళలు సురక్షితంగా లేరని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సర్వే వెల్లడించిందని తెలిపారు. సర్వే ప్రకారం, 45 శాతం మంది వైద్యులకు రాత్రిపూట డ్యూటీ రూమ్‌లు అందుబాటులో లేవని పేర్కొన్నారు.
ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని కోరారు. వైద్యులకు భద్రత కల్పించడం తమ ప్రాధాన్యత కావాలని అన్నారు, తద్వారా వారు అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స చేయవచ్చు, ఎటువంటి భయం లేకుండా దేశానికి సేవ చేయవచ్చని తెలిపారు.