ఏపీ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా చేస్తాం
ప్రకటించిన మంత్రి నారా లోకేష్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందంజలో ఉండేలా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో ఐటీని తీసుకు వచ్చిన ఘనత తన తండ్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. దీని వల్ల మన రాష్ట్రం ప్రగతి పథంలో వెనక్కి వెళ్లి పోయిందని మండిపడ్డారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు నారా లోకేష్.
ఐటీ పరంగా హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు టాప్ లో ఉండేలా చేశారని తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడి ఐఎస్ బిని హైజాక్ చేసి హైదరాబాద్ కు రప్పించిన ఘనత తన తండ్రికే దక్కుతుందన్నారు నారా లోకేష్.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్ ను చూడ బోతున్నామని చెప్పారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని నెం.1గా నిలిపిన చంద్రబాబు నాయుడు , ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించ బోతున్నారని ప్రకటించారు నారా లోకేష్. 1995లో మాదిరిగానే పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు.