విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేస్తాం
ప్రకటించిన ఏపీ మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంపై తమ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందన్నారు. గురువారం జరిగిన ఐటీ సదస్సులో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటి పరిశ్రమల్లో 90 శాతం విశాఖపట్నానికే రాబోతున్నాయని ప్రకటించారు మంత్రి. విశాఖలో ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేవలం ఐటిలో మాత్రమే కాకుండా ఫార్మా, ఎంఎస్ఎంఇ వంటి రంగాల్లో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు నారా లోకేష్.
అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖను ఐటి క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు నారా లోకేష్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి. సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు.
గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖలో తన కోసం విలాస వంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ ఒక్క చదరపు అడుగు కూడా ఐటి స్పేస్ కోసం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు నారా లోకేష్. ఐటి పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.