గుడ్లవల్లేరు ఘటనపై లోకేష్ స్పందన
బాధ్యులు ఎవరైనా సరే చర్యలు తప్పవు
విశాఖపట్నం – కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారంటూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్.
ఈ మొత్తం వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నానని తెలిపారు. శుక్రవారం నారా లోకేష్ విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా తనను కలుసుకున్న జర్నలిస్టులతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. హిడెన్ కెమెరాలు ఎవరు పెట్టారనే దానిపై విచారణ చేపట్టాలని స్పష్టం చేసినట్లు చెప్పారు నారా లోకేష్.
విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లేకపోతే చర్యలు తప్పవని నారా లోకేష్ హెచ్చరించారు.