విద్యార్థినుల ఆందోళన తల్లిదండ్రుల ఆవేదన
విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ – దేశంలో రోజు రోజుకు బాలికలు, యువతులు, మహిళల పట్ల ఏదో ఒక చోట వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన పిల్లల పేరెంట్స్ ను ఆందోళన కలిగించేలా చేసింది.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు రోడ్డెక్కారు. తమకు తెలియకుండా కాలేజీలో, గర్ల్స్ హాస్టల్స్ లో , ఇతర చోట్ల రహస్యంగా కెమేరాలు అమర్చారని ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విషయం గురించి కాలేజీ యాజమాన్యానికి తెలిసినా పట్టించు కోలేదని ఆరోపించారు బాధిత విద్యార్థినులు.
ప్రధానంగా బాలికలకు సంబంధించిన వాష్ రూమ్ లలో రహస్యంగా కెమెరాలు పెట్టారని, 300కు పైగా వీడియోలు రికార్డ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి నుంచి విద్యార్థినులు వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.
ఇదిలా ఉండగా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ ఓ స్టూడెంట్ పై దాడికి దిగడం కలకలం రేపింది. ఈ మొత్తం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగడంతో వెంటనే స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు . ఈ మేరకు విచారణ చేపట్టాలని ఆదేశించారు. అంత వరకు విద్యార్థినులు సంయమనం పాటించాలని కోరారు సీఎం.