షాకింగ్ కామెంట్స్ చేసిన కల్వకుంట్ల కవిత
వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తి సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డికి ఉద్యమం, కళలు, కళాకారులు ఏమీ తెల్వవు అని అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రుల దగ్గరకు వెళ్లి కళాకారుల పెన్షన్ గురించి మాట్లాడితే కళాకారులు అంటే ఎవరని అడుగుతుండడం బాధాకరమని అన్నారు కవిత. జనం బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణ జాగృతి తరఫున కళాకారుల గుర్తింపు కార్డులు తయారు చేద్దాం అని అన్నారు.
వాటిని ప్రభుత్వానికి పంపించి పెన్షన్ వచ్చేలా చేసుకుందాం అని తెలిపారు.
ముందుగా ప్రభుత్వం జానపద అకాడమీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా. కళాకారులను గుర్తించుకుంటే కేంద్రం నుంచి సులువుగా పెన్షన్లు వస్తాయి అని అన్నారు. ఇక సాంప్రదాయ కళాకారులను కూడా ప్రభుత్వం గుర్తించాలని కోరారు కవిత. అమర వీరుల ప్రాణ త్యాగంతోనే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. వారి కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కొన్ని అమర వీరుల కుటుంబాలకే డబ్బులు ఇవ్వటం జరిగిందని ఆరోపించారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు జాగృతి పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వారిని మార్చేసి కొత్త ప్రభుత్వం ద్వారా కోటి రూపాయలు వచ్చేలా చేసుకుందాం అని అన్నారు.






