newsseals.com
News

పార్కుల‌ను కాపాడాల‌ని హైడ్రాకు ఫిర్యాదు

VijayaBhaskar November 11, 2025
newsseals-HYDRAA
Spread the love

హైడ్రా ప్ర‌జావాణికి 47 ఫిర్యాదులు

హైద‌రాబాద్ : పార్కుల‌ను నామ‌రూపాలు లేకుండా చేస్తున్నారని, గుడులు క‌ట్టి వ్యాపారాలు చేసుకుంటున్నార‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి హైడ్రా ప్ర‌జా వాణికి. లే ఔట్‌ల‌లో పార్కుల కోసం కేటాయించిన స్థ‌లాల‌న్నిటికీ ఫెన్సింగ్‌లు వేసి కాపాడాలంటూ కోరారు. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కూడా కాపాడాల‌ని విన్న‌వించారు. అమీన్‌పూర్ పెద్ద‌చెరువు, రావిర్యాల చెరువుల విస్తీర్ణం ఏటా పెరుగుతూ.. ఎగువ భాగంలో ఉన్న నివాసాల‌ను ముంచెత్తుతున్నాయ‌ని ఆయా ప్రాంతాల వారు ఫిర్యాదు చేశారు. మూసేసిన తూములు తెరిపించ‌డంతో పాటు.. అలుగు ఎత్తును కూడా త‌గ్గించాల‌ని కోరారు. గ‌తంలో వ్య‌వ‌సాయ వినియోగం వ‌ల్ల నీటి నిలువ‌లు త‌గ్గేవ‌ని, ఇప్పుడు మురుగు నీటితో నిండి ఎగువున ఉన్న ప్రాంతాలు మునుగుతున్నాయ‌ని వాపోయారు. ఓల్డ్ అల్వాల్ స‌ర్వే నంబ‌రు 576లో క్వారీకోసం త‌వ్విన గుంత‌ల్లో మురుగు నీరు చేరి ప‌రిస‌రాల‌న్నీ దుర్గంధ భ‌రితంగా మారాయ‌ని గంగ అవెన్యూ రెసిడెంట్స్ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. ఈ గుంత‌ల‌ను మ‌ట్టితో పూడ్చి పార్కులుగా అభివృద్ధి చేయాల‌ని కోరారు.

హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 47 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్ ఎన్ అశోక్ కుమార్‌ ప‌రిశీలించి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లం మ‌చ్చ‌బొల్లారం గ్రామం స‌ర్వే నంబ‌రు188లో 30 గుంట‌ల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురౌతోంద‌ని బాలాజీ ఎన్‌క్లేవ్ రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. 60 కాల‌నీల‌లో 60 వేలకు పైగా ఇళ్లున్న ఈ ప్రాంతంలో ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల నిర్మించేందుకు ఈ భూమిని కేటాయించేలా సిఫార‌సు చేయాల‌ని కోరారు . సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం ఏటా పెరిగిపోయి ఎగువున ఉన్న త‌మ ప్లాట్లు మునిగి పోయాయ‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. గ‌తంలో తూముల ద్వారా కింద‌కు నీరు వెళ్లేద‌ని, ఇప్పుడు వాటిని పూర్తిగా బంద్ చేయ‌డంతో మురుగు, వ‌ర్షం నీరంతా చెరువులోకి చేరుతోంద‌ని పేర్కొన్నారు.