NEWSTELANGANA

టీటీడీ త‌ర‌హాలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు

Share it with your family & friends

ఆదేశాలు జారీ చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) బోర్డు త‌ర‌హాలో యాద‌గిరిగుట్ట ఆల‌య అభివృద్ది బోర్డు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు ముఖ్య‌మంత్రి.

ఇందుకు సంబంధించి వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. శుక్ర‌వారం యాద‌గిరిగుట్ట ఆల‌య అభివృద్దిపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు, ఆల‌య ఈవో త‌దిత‌రులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు వెంట‌నే ఇవ్వాల‌ని సీఎం ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు , భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలని సూచించారు రేవంత్ రెడ్డి.

ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని , అర్ధాంత‌రంగా ఆప‌డానికి వీలు లేద‌ని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు అంద‌జేయాల‌ని ఆదేశించారు రేవంత్ రెడ్డి.