NEWSTELANGANA

పేద‌ల ఇళ్ల‌ను కూల్చి వేస్తే ఎలా..?

Share it with your family & friends

మాజీ మంత్రి కేటీఆర్ ఖ‌ర్గేకు ప్ర‌శ్న

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాల‌మూరులో నిరుపేద‌లు, విక‌లాంగుల‌కు చెందిన ఇళ్ల‌ను కూల్చి వేయ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. ఈ విష‌యం గురించి మ‌రోసారి ఆలోచించాల‌ని ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఇలా కూల్చి వేత‌ల‌కు పాల్ప‌డ‌డం వ‌ల్ల వారంతా నిరాశ్ర‌యులుగా మారార‌ని వాపోయారు కేటీఆర్.

ఈ విష‌యంపై త‌మ ప్ర‌భుత్వానికి దూకుడు త‌గ్గించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు లేఖ రాశారు మాజీ మంత్రి. ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయ‌మ‌ని మండిప‌డ్డారు కేటీఆర్.

తెలంగాణాలో చట్టం , న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతోంద‌ని ఆరోపించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చి వేయ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ఈ నిరుపేద‌ల్లో 25 కుటుంబాలు వికలాంగుల‌కు చెందిన‌వి ఉన్నాయ‌ని వారి ప‌ట్ల మాన‌వ‌తా దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు కేటీఆర్. బుల్ డోజ‌ర్ వ్య‌వ‌స్థ‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని డిమాండ్ చేశారు .