తెలంగాణలో వర్షాల వెల్లువ
అప్రమత్తంగా ఉండక పోతే కష్టం
హైదరాబాద్ – భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలో. ఇప్పటికే జలాశయాలు నిండు కుండలను తలపింప చేస్తున్నాయి. మరో వైపు వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అటు ఏపీలో ఇటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.
ఇక చిన్న చినుకులు పడితే చాలు హైదరాబాద్ నగరం పూర్తిగా అస్తవ్యస్తంగా మారే పరిస్థితి నెలకొంది. లెక్కకు మించిన జనాభా ఉండడంతో ఎక్కడికక్కడ భవనాల నిర్మాణం చేపట్టడం, నాలాల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అటు పాదచారులు ఇటు వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు.
తాజాగా ఇలాగే వర్షాలు కురిస్తే రాబోయే రోజుల్లో నగర జీవనం పూర్తిగా స్తంభించి పోయే ప్రమాదం లేక పోలేదు. వచ్చే 48 గంటలలో దక్షిణ తెలంగాణలో వర్షాలు అత్యధికంగా కురిచే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కృష్ణా, మూసీ, మంజీర నదులకు భారీ ఎత్తున వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.