సీఎం నిర్లక్ష్యం విద్యా వ్యవస్థకు శాపం
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
గురుకులాలు, కేజీబీవీలు, హాస్టల్స్ లలో పేద పిల్లలే చదువుకుంటున్నారని , వారిని కావాలని కులం పేరుతో దూషించడం, కనీస వసతి సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేయడం దారుణమని పేర్కొన్నారు.
ఇది మంచి పద్దతి కాదని అన్నారు ఆర్ఎస్పీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కీలకమైన విద్యా శాఖకు మంత్రి లేక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
టీచర్లు లేక బడులు మూత పడుతున్నాయని, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలను ప్రోత్సహించేందుకే వీటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సమస్యల గురించి రోడ్డెక్కిన విద్యార్థుల గురించి కేజీబీవీ జీసీడీఓ జిల్లా ఇంఛార్జి సుజాత ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల పట్ల చులకనగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.