భారీ వర్షాలపై సీఎం బాబు ఆరా
అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
అమరావతి – రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో శనివారం కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు.
పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం.
ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని, అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని, పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని అన్నారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం.
ఇదిలా ఉండగా వాయవ్య బంగాళా ఖాతంలో అల్ప పీడనం ఏర్పడడంతో ఇటు ఏపీలో అటు తెలంగాణలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ కూర్మనాథ్ హెచ్చరించారు.