NEWSANDHRA PRADESH

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Share it with your family & friends

మంత్రి అనగాని సత్యప్రసాద్

అమ‌రావ‌తి – రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.

జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు, రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మంత్రి. వర్షాలకు ఉధృతంగా ప్రవహించే వాగుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని సూచించారు స‌త్యప్ర‌సాద్.

పలు చోట్ల విష జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు వేగవంతం చేయాలని, ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు మంత్రి.

ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో చెరువులు నిండుతాయ‌ని, అలాంటి చోట్ల నీటిపారుదల శాఖ అధికారులు చెరువులను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అన్నారు.

భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెల‌వులు ఇవ్వాల‌ని ఆదేశించారు మంత్రి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లినవారు జాగ్రత్తగా తీరం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.