NEWSANDHRA PRADESH

ఆర్థిక ఇబ్బందులున్నా పెన్ష‌న్లు పంపిణీ

Share it with your family & friends

స్పష్టం చేసిన స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు

అన‌కాప‌ల్లి – రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, అయినా అష్ట క‌ష్టాలు ప‌డి పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నామ‌ని అన్నారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు. శ‌నివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది.

ఓ వైపు భారీ వ‌ర్షాలు రాష్ట్ర‌మంత‌టా కురుస్తున్నా ఉద్యోగులు, సిబ్బంది తెల్ల‌వారు జామునే పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.

అన‌కాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందని అన్నారు.

ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేశామని చెప్పారు అయ్య‌న్న పాత్రుడు.

ఈ రోజు ఉదయం 9.30 గంటలకే 80 శాతం పింఛన్లు పంపిణీ చేశామని, కొత్తగా అర్హులైన వారికి అక్టోబరు నుంచి పింఛన్లు అందుబాటులో ఉంటాయని ప్ర‌క‌టించారు.

అనర్హులైన వారిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, డ్వాక్రా గ్రూపు మహిళలందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గ్రామాలన్నీ శుభ్రం చేసే కార్యక్రమం ప్రతీ గ్రామం లో జరుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.