పిల్లల రోదన గాడి తప్పిన పాలన
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
రంగారెడ్డి జిల్లా – ప్రజా ప్రభుత్వం అంటూ పదే పదే చెబుతూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా గాడి తప్పిందని తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల లోని గురుకులాన్ని సందర్శించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలను చూసి విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
తమను పట్టించు కోవడం లేదని , తమకు సరైన ఆహారం పెట్టడం లేదని వాపోయారు. ఇలాగైతే తమ పరిస్థితి ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను పరామర్శించిన అనంతరం తన్నీరు హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డిని నిలదీశారు. గురుకులాలలో తమ ప్రభుత్వం సన్న బియ్యంతో అన్నం పెట్టామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గొడ్డు కారంతో పిల్లల కడుపులు మాడ్చుతోందంటూ ధ్వజమెత్తారు హరీశ్ రావు.
కాంగ్రెస్ 9 నెలల పాలనా కాలంలో 500 మందికి పైగా విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారని వాపోయారు. ఇప్పటి వరకు 38 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. గురుకులాలను గాలికి వదిలి వేశారని, విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు హరీశ్ రావు.