కరెంట్ బిల్లులు చెల్లించొద్దు
పిలుపునిచ్చిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తాత్సారం చేస్తోందంటూ మండిపడ్డారు. శనివారం ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గృహ జ్యోతి పథకం అమలు చేసేంత వరకు జనవరి నెల కరెంట్ బిల్లులు చెల్లించవద్దంటూ రాష్ట్ర ప్రజలకు విన్నవించారు కేటీఆర్.
ఢిల్లీలోని సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల ఇళ్లకు మీ కరెంట్ బిల్లులు పంపించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి.
హైదరాబాద్ లోని ప్రతి మీటర్ కు గృహ జ్యోతి పథకం కింద ఉచితంగా కరెంట్ ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు దాని గురించి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే కానున్నారని, త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కానున్నాయని ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి చోటా మోడీగా మారారని, ఆయనలో బీజేపీ రక్తం ప్రవహిస్తోందని పేర్కొన్నారు. అదానీ, ప్రధాని డబుల్ ఇంజన్ కు తోడు రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఇంజన్ గా మారాడని ధ్వజమెత్తారు కేటీఆర్.