కేసీఆర్ మేనిఫెస్టోలతో వస్తే బెటర్
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏం సాధించారని కేసీఆర్ బయటకు వస్తారంటూ ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సర్వ నాశనం చేసింది చాలక ఇంకేం ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తారంటూ ఎద్దేవా చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చలేక, వడ్డీలు కట్టలేక తమ కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ.
ఇన్నాళ్లూ ప్రజల్లోకి రావడానికి ముఖం చెల్లని కేసీఆర్.. బిడ్డకు బెయిల్ రావడంతో ఇప్పుడు బయటికి వస్తా అంటున్నారు. మంచిదే అని అన్నారు. ఇదే సమయంలో వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు ఎంపీ.
అయితే కేసీఆర్ వచ్చే ముందు 2014లో , 2018 వారి పార్టీ మేనిఫెస్టోలు వెంట తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, వారి మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చిందో చర్చకు రావాలని డిమాండ్ చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.