గురుకులాలపై వివక్ష కాంగ్రెస్ సర్కార్ కక్ష
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్
నల్లగొండ జిల్లా – రాష్ట్రంలో గురుకులాలను కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు. రాత్రి పూట పడుకున్న విద్యార్థులను ఎలుకలు కరవడంతో 14 మందికి గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న వెంటనే హరీశ్ రావు , మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్ , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆర్. రవీంద్ర కుమార్, డా. గాదరి కిశోర్ కుమార్, ఎన్. భాస్కర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలిసి సందర్శించారు.
బాధిత విద్యార్థులను పరామర్శించారు హరీశ్ రావు. అనంతరం మీడియాతోత మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి అనర్హుడని పేర్కొన్నారు. విద్యా శాఖతో పాటు సాంఘిక సంక్షేమ పాఠశాలలు కూడా తన పరిధిలోకే వస్తాయని ఇప్పటి వరకు వాటి ఆలనా పాలనా చూడడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. సోయి లేకుండా ఉండడం విస్తు పోయేలా చేస్తోందన్నారు హరీశ్ రావు.