నిలిచి పోయిన తమిళనాడు ఎక్స్ ప్రెస్
ప్రయాణీకులు సురక్షిత ప్రాంతాలకు
అమరావతి – రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల తాకిడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తల్లడిల్లుతోంది. ఓ వైపు సహాయక చర్యలలో నిమగ్నం అయ్యింది అధికార యంత్రాంగం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుత పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల దెబ్బకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. దీంతో రైల్వే రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు రైల్వే పట్టాలపై ప్రవహిస్తుండడంతో రైళ్లను ముందు జాగ్రత్తగా నిలిపి వేశారు రైల్వే ఉన్నతాధికారులు.
ఇదిలా ఉండగా రాయనపాడు సాటిలైట్ రైల్వే స్టేషన్ చేరుకున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్ ను అర్ధారంతరంగా నిలిపి వేశారు. సుమారు 1600 మంది ప్రయాణికులను జిల్లా కలెక్టర్ జి. సృజన ఆదేశాలతో విజయవాడ ఆర్డీవో బిహెచ్ భవాని శంకర్ పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు సురక్షితంగా విజయవాడ రైల్వే స్టేషన్ కి తరలించారు.
ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాల సహకారంతో వరద ఉధృతి దృష్ట్యా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ద్వారా, అక్కడ నుంచి 30 ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా చేర్చారు.
ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా రెవెన్యూ యంత్రాంగం అల్పాహారం భోజనం ఏర్పాట్లు చేసింది.