వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
నీటిని పరిశీలించిన పొంగూరు..కొల్లు రవీంద్ర
అమరావతి – రాష్ట్రంలో భారీ ఎత్తున గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచి పోవడంతో జన జీవనం స్తంభించి పోయింది. బస్సులు, రైళ్ల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో పరిస్థితి భయానకంగా తయారైంది. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష చేపట్టారు.
డ్రోన్ల సాయంతో పర్యవేక్షించాలని సూచించారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని ఆదేశించడంతో మంత్రులు పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనితతో పాటు ఎమ్మెల్యేలు బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా విజయవాడ చిట్టినగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని. బుడమేరు వాగు పొంగి ఇళ్లలోకి చేరిన నీటిని పరిశీలించారు.