యుండమూరికి బయోగ్రఫీ బాధ్యత
అప్పగిస్తున్నానన్న చిరంజీవి
విశాఖపట్టణం – మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. తన జీవిత చరిత్రను రాసే అవకాశం ప్రముఖ రచయిత, మోటివేషనల్ స్పీకర్ , దర్శకుడు యుండమూరి వీరేంద్ర నాథ్ కు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. శనివారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతి నటుడికి స్వంత జీవితం అనేది ఉంటుందన్నారు. ఒక్కో నటుడిది ఒక్కో శైలి అని. కొందరిలో కొన్ని నేర్చు కోవాల్సినవి, ఆచరించాల్సిన లక్షణాలు ఉంటాయని, జీవిత చరిత్ర అందుకు దోహద పడుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
తాను కూడా బంగారు చెంచా కుటుంబం నుంచి రాలేదన్నారు. కష్టపడి ఓ కానిస్టేబుల్ కొడుకుగా మీ ముందుకు వచ్చానని అన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో తనకు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు చిరంజీవి.
నా బయోగ్రఫీ రాసే సమయం తనకు ఉండదన్నారు. సమకాలీన రచయితలలో యుండమూరికి సాటి రాగల రచయితలు తెలుగునాట లేరన్నారు మెగాస్టార్. నా వరకు యుండమూరి తీసిన అభిలాష సినిమాతోనే నేను ఏమిటో జనాలకు తెలిసిందన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నాకు దైవ సమానులని కొనియాడారు.