మహా నాయకుడికి మరణం లేదు
వైఎస్సార్ కు షర్మిల నివాళి
కడప జిల్లా – దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహా నాయకుడని ఆయనకు మరణం అన్నది లేనే లేదన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సోమవారం వైఎస్సార్ 15వ వర్దంతిని పురస్కరించుకుని వైఎస్ షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు ఏపీ పీసీసీ చీఫ్. తన తండ్రి ప్రజా నాయకుడని, జనం గుండెల్లో ఎల్లప్పటికీ నిలిచే ఉంటారని పేర్కొన్నారు. చివరి క్షణం వరకు ప్రజల కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయనకు కూతురుగా పుట్టడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చ లేనిదని పేర్కొన్నారు. భౌతికంగా వైఎస్సార్ మన మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉన్నారని తెలిపారు. తన తండ్రి ఆశయాలే లక్ష్య సాధనగా నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాయంటూ చెప్పారు.
అంతకు ముందు వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతీ రెడ్డి నివాళులు అర్పించారు.