మృతుల కుటుంబాలకు..జీవాలకు సాయం
ప్రకటించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం కంట్రోల్ కమాండ్ సెంటర్ లో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం హుటా హుటిన రోడ్డు మార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు బయలు దేరారు. బాధితులను పరామర్శించనున్నారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరదల కారణంగా అనుకోకుండా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో పాటు వరద ఉధృతికి కొట్టుకు పోయిన గేదెలు, గొర్రెలు, మేకలు, ఇతర జీవాలకు గతంలో ప్రకటించిన దానికంటే ఈసారి ఎక్కువ ఇవ్వాలని ఆదేశించారు.
ఇందులో బాగంగా చని పోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కో దానికి ఇచ్చే రూ. 3 వేల సాయం నుంచి రూ.5 వేలకు పెంచాలని సీఎం సీఎస్ ను ఆదేశించారు.
తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బ తిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించాలని ఆదేశించారు.