శ్రీవారి భక్తులకు తగినన్ని లడ్డూలు – టీటీడీ
శుభ వార్త చెప్పిన ఈవో జె. శ్యామల రావు
తిరుమల – శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో జె. శ్యామలరావు ప్రకటించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, తగినన్ని రూ.50/- లడ్డూ ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యం అన్నారు.
స్వామివారిని దర్శించు కోకుండా లడ్డూల కొరకు నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్ళే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజు వారి రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు.
టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నదని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేని వారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి, బయట ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందన్నారు. అదే విధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందన్నారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందన్నారు.
తిరుమల లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామన్నారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటి వ్యవస్థ సహకారంతో గత 3 రోజులుగా, భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు, దర్శనం చేసుకోని వారు ఎన్ని లడ్డూలు తీసుకొంటున్నారు, తదితర విషయాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు.