NEWSTELANGANA

సాగ‌ర్ ఎడ‌మ కాల్వను ప‌రిశీలించిన ఉత్త‌మ్

Share it with your family & friends

ప్రమాద ప‌రిస్థితిపై మంత్రి స‌మీక్ష

న‌ల్ల‌గొండ జిల్లా – తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సోమ‌వారం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హుజూర్ న‌గ‌ర్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. వాయ‌వ్య బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం కార‌ణంగా అటు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఇటు తెలంగాణ‌లో వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి.

ఇప్ప‌టికే ప్రాజెక్టుల‌న్నీ నిండు కుండ‌ల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి కార‌ణంగా పెద్ద ఎత్తున పంట‌ల‌ను కోల్పోయారు రైతులు. మ‌రో వైపు ప‌లు జిల్లాల్లో ఊహించ‌ని దానికంటే వ‌ర్షాలు ముంచెత్తాయి. ఈ త‌రుణంలో సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేప‌ట్టారు.

స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఇందులో భాగంగా నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మీక్ష చేప‌ట్టారు. హుజూర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఎడ‌మ కాల్వ ప్ర‌మాద ప‌రిస్థితికి చేరుకుంద‌ని తెలుసుకున్నారు.

విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి ఉత్త‌మ్ అక్క‌డికి చేరుకున్నారు. ప్ర‌మాద ప‌రిస్తితికి చేరుకున్న కాల్వ‌ను ప‌రిశీలించారు. వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు మంత్రి.