NEWSTELANGANA

ప్ర‌జ‌లు స‌ర్వం కోల్పోయారు – సీఎం

Share it with your family & friends

ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా ఆదుకుంటుంది

ఖ‌మ్మం జిల్లా – భారీ వ‌ర్షాలు, వ‌ర‌దల కార‌ణంగా తెలంగాణ రాష్ట్రానికి అపార‌మైన న‌ష్టం వాటిల్లింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను పరామ‌ర్శించారు. అనంత‌రం
ఖమ్మం కలెక్టరేట్ లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి అధికారులకు మార్గనిర్ధేశం చేశారు. స్వయంగా రెండు రోజులుగా ప్రజలను రక్షించే పని చేసినప్పటికీ దురదృష్టవశాత్తు 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

వేల కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నిరంతరాయంగా పని చేయడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టం సాధ్యమైనంత మేరకు నివారించగలిగామని చెప్పారు.

తాజా పరిస్థితులను ప్రధాని, కేంద్ర హోం మంత్రికి వివరించామని, తక్షణమే నష్ట నివారణకు సహకరించాలని అడిగిన విషయాన్ని ప్రజలకు వివరించారు. తాత్కాలిక ఉపశమనంగా ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రాన్ని రూ.5,438 కోట్ల రూపాయాలు ఇవ్వాలని కోరామ‌న్నారు. జరిగిన నష్టాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించాలని కోరినట్టు చెప్పారు.

ప్రజలు సర్వం కోల్పోయారు. కట్టు బట్టలతో మిగిలారు. ఇండ్లలో బురద మిగిలింది. వాళ్లను ఆదుకోడానికి ఖమ్మంలో 34 క్యాంపులు 2,119 కుటుంబాల్లో 7,467 మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతి ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వానికి త‌న వంతుగా మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు రూ. 5 ల‌క్ష‌లు సాయం ప్ర‌క‌టించార‌ని తెలిపారు .