అపార నష్టం ఆంధ్రప్రదేశ్ కు శాపం
జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న సీఎం
అమరావతి – ఓ వైపు వర్షాలు మరో వైపు వరదలతో అస్తవ్యస్తంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో మంత్రులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు.
బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు వరదల ధాటికి 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సీఎం వెల్లడించారు. కేంద్రం అడిగిన వెంటనే బోట్లను పంపించిందని తెలిపారు.
తాను కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నానని, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించానని చెప్పారు. బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ముగ్గురు గల్లంతు అయ్యారని, 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. .
3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీటి పాలయ్యాయని, 34 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని ఆవేదన చెందారు. 1067.57 కిలో మీటర్లు మేర రోడ్లకు డ్యామేజ్ ఏర్పడిందన్నారు సీఎం. ఇప్పటి వరకు వెయ్యికి పైగా సోలార్ లాంతర్లను పంపిణీ చేశామని, ఇంకా 4 వేలు పంపిణీ చేయాలని ఇంధన వనరుల శాఖను ఆదేశించామని చెప్పారు చంద్రబాబు నాయుడు.
ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. వరదల సమయంలో కూడా రాజకీయాలు చేయడం దారుణమన్నారు. ఇది జగన్ రెడ్డికి తగదని పేర్కొన్నారు.