మాజీ మంత్రుల వాహనాలపై దాడి దారుణం
కాంగ్రెస్ గూండాల నిర్వాకంపై దాసోజు ఫైర్
హైదరాబాద్ – ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, గుండ్లకట్ల జగదీశ్వర్ రెడ్డి ప్రయాణిస్తున్న కార్లపై కాంగ్రెస్ కు చెందిన గూండాలు దాడి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీ స్పోక్స్ పర్సన్ దాసోజు శ్రవణ్ కుమార్
మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడడం దారుణమన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది పిరికిపంద చర్యగా దాసోజు శ్రవణ్ కుమార్ అభివర్ణించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై, మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు.
ఇటువంటి అనాగరిక హింసోన్మాద చర్యలు సామాజిక ప్రశాంతతను నాశనం చేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధ్యులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.