మెగాస్టార్ సాయం రూ. కోటి విరాళం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 50 లక్షలు
హైదరాబాద్ – ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించి పోయింది. ఎక్కడ చూసినా నీళ్లే. పెద్ద ఎత్తున బాధితులు పునరావాస కేంద్రాలలో ఉంటున్నారు. వీరందరి కోసం పలువురు ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమకు తోచిన మేరకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు స్పందించారు. తమ ఉదారతను చాటుకున్నారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ , ప్రిన్స్ మహేష్ బాబు రూ. కోటి చొప్పున విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు.
మరో వైపు అనన్య నాగళ్ల రూ. 5 లక్షలు, విశ్వక్ సేన్, జొన్నల గడ్డ సిద్దు, తదితర నటులు కూడా తమ వంతుగా సాయం ప్రకటించారు. ఇదిలా ఉండగా బుధవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి సైతం తన ఉదారతను చాటుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.